juice jacking in telugu

juice jacking in telugu

చార్జింగ్ పెట్టుకుంటే బ్యాంకు ఖాతా ఖాళి అయింది.
 
 



దేశరాజధాని ఢిల్లీలో ఓ యువకుడు తన ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోవడంతో దగ్గరలోని వాణిజ్య సముదాయానికి వెళ్లి అక్కడున్న యూఎస్‌బీ పోర్టు నుంచి ఉచితంగా ఛార్జింగ్‌ చేసుకున్నాడు… 
కొద్దిసేపటికే అతని బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. 
నీ వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు మా దగ్గరున్నాయి… 
అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని నీ ఫోన్‌లో ఉన్న నెంబర్లన్నింటికీ పంపుతామని ఆ యువకుడికి ఓ బెదిరింపు కాల్‌ కూడా వచ్చింది. దాంతో ఆ యువకుడు సైబర్‌ నిపుణులను ఆశ్రయించాడు. జరిగిందంతా విన్న నిపుణులు అతను #జ్యూస్‌జాకింగ్‌ కు గురైనట్లు గుర్తించారు. 



జ్యూస్‌ జాకింగ్‌ అంటే..? 

సులభంగా చెప్పాలంటే గ్లాసులో ఉన్న పళ్ల రసాన్ని స్ట్రాతో జుర్రుకున్నట్లే ఎలక్ట్రానిక్‌ ఉపకరణంలో ఉన్న సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్‌బీ పోర్టు ద్వారా కొట్టేయడం అన్నమాట. స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు  ఛార్జింగ్‌ చేసుకోవడానికి పలు సంస్థలు, కార్యాలయాలు ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వాణిజ్యసముదాయాలు, ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లోనూ స్మార్ట్‌ పరికరాలు ఛార్జ్‌ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఛార్జింగ్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో నాలుగైదు యూఎస్‌బీ కేబుల్స్‌ ఉంటాయి. మీరు ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి వాటికి కనెక్ట్‌ చేస్తే చాలు ఛార్జింగ్‌ అవుతుంది. ఇలాంటి కేంద్రాల్లోకి ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు చొరబడుతున్నారు. ఛార్జింగ్‌ కోసం అమర్చిన యూఎస్‌బీ పోర్టును మార్చేస్తున్నారు. దాని స్థానంలో అచ్చం అలాగే ఉండేలా సొంతంగా తయారుచేసిన పోర్టును అమరుస్తున్నారు. ఎవరైనా తమ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఛార్జింగ్‌ చేసుకునేందుకు వీటికి కనెక్ట్‌ చేయగానే ఛార్జింగ్‌ కావడం మొదలవుతుంది. 
అదే సమయంలో ఉపకరణంలోని సమాచారమంతటినీ యూఎస్‌బీ పోర్టు తస్కరిస్తుంది.

ఎలా జరుగుతుంది..? 


ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఛార్జింగ్‌, సమాచార మార్పిడికి వేర్వేరు పోర్టులు లేవు. దీన్నే నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని జ్యూస్‌ జాకింగ్‌కు తెర లేపారు. ఛార్జింగ్‌ పెట్టుకునేటప్పుడు అదే కేబుల్‌ ద్వారా సమాచారం తస్కరిస్తున్నారు. ఎవరైనా ఛార్జింగ్‌ చేసుకునేందుకు తమ ఉపకరణాన్నిఆ కేబుల్‌కు అనుసంధానించగానే సమాచారం గల్లంతవుతుంది. తస్కరించిన సమాచారమంతా యూఎస్‌బీ పోర్టులో నిల్వ అయిన తర్వాత దాన్ని తీసుకుని ఆ డేటాను సంగ్రహిస్తున్నారు. లేదంటే బ్లూటూత్‌కు అనుసంధానించి అందులో ఉన్న సమాచారాన్ని తమ దగ్గరున్న పరికరంలోకి బదిలీ చేసుకుంటున్నారు. 
బెదిరింపులు షురూ…
ఒక్కసారి ఈ సమాచారం చేతికి చిక్కిన తర్వాత ఫోన్‌ యజమానిని బెదిరించడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు చాలామంది తమ బ్యాంకు ఖాతా వివరాలు పిన్‌ నెంబర్లు సహా ఫోన్‌లో దాచుకుంటున్నారు. 
ఈ డేటా దొరకగానే నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
లేదంటే ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత విషయాలు బయట పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. 
వైరస్‌ చొప్పించి… 
ఛార్జింగ్‌ పేరుతో సమాచారం తస్కరించడం ఒక ఎత్తయితే ఇంకొందరు నేరగాళ్లు మార్పిడి చేసిన యూఎస్‌బీ పోర్టు ద్వారా వైరస్‌(ట్రోజన్‌హార్స్‌)లను ఫోన్లలోకి చొప్పిస్తున్నారు. అంటే ఛార్జింగ్‌ పెట్టగానే యూఎస్‌బీ పోర్టులో ఉన్న ట్రోజన్‌హార్స్‌ సదరు ఉపకరణంలోకి ప్రవేశించి దాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటుంది. 
తాము అడిగినంత డబ్బులివ్వకపోతే ఉపకరణం పనిచేయకుండా చేస్తామని, అందులో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగపరుస్తామని బెదిరింపులు మొదలుపెడుతున్నారు.

పరిష్కారం ఏమిటి..?


వీలైనంత వరకూ పవర్‌బ్యాంకు దగ్గర పెట్టుకోవాలి. తద్వారా ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్‌ చేసుకోవాల్సిన పని ఉండదు. 
బహిరంగ ప్రదేశాల్లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఛార్జింగ్‌ చేసుకునేటప్పుడు వాటిని స్విచాఫ్‌ చేయాలి.

ఫోన్‌ లాక్‌ చేసుకోవడం ద్వారా అందులో సమాచారం మరొకరు తస్కరించకుండా చూసుకోవచ్చు. 

లాక్‌చేసిఉన్నఫోన్‌ నుంచి సమాచార మార్పిడి జరగదు.

ఛార్జింగ్‌ పెట్టేటప్పుడు సమాచార బదిలీ (డేటా ట్రాన్స్‌ఫర్‌) ఆప్షన్‌ను ఆఫ్‌ చేయాలి.



అప్రమత్తంగా ఉండండి.

ప్రజల వద్ద ఉన్న సమాచారాన్ని ఏదో ఒక రూపంలో కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. సైబర్‌ నేరాల పట్ల అవగాహన పెంచుకుంటేనే ఇలాంటి వాటి నుంచి కాపాడుకోగలం. వీలైనంత వరకూ బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్‌ చేసుకోకుండా ఉండాలి. బ్యాటరీని జాగ్రత్తగా, అవసరం కోసం మాత్రమే వాడుకుంటే ఇలా ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్‌ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.